Archive for నవంబర్, 2010

అమెరికతలు-2..

నవంబర్ 26, 2010
౨-౩ రోజులుంచి అటు ఇటు తిరుగుతూ  సరిగ్గా నిద్రలేదేమో, బాగా నిద్ర పట్టేసింది. లెగిచి చూద్దును కదా ఏ దేశం మీదున్నామో తెలియక పోయినా  తెల్లారినట్టు తెలిసింది. వాచి చూసుకుంటే ఒక ౮ గంటలు నిద్రేసాం  అని అర్ధం అయ్యింది. బ్రేక్ ఫాస్టు అవి కానిచ్చి, పక్కనున్న బాబాయి గారితో లోకాభిరామాయణం మొదలెట్టాను. ఆయన అదే మొదటి సారి యు.ఎస్ పిల్లల దగ్గరకు వెళ్తున్నారని తెలిసింది.లావేట్రి దగ్గర కునికి పాట్లు పడుతున్న ఇద్దర్ని చూపించి, అదేంటబ్బాయి అందరు ఇక్కడే నిలబడక పొతే బైటకేల్లోచ్చు కదా…అన్నాడు.అప్పుడే ఏదో కొంచెం ఉన్న నిద్ర మత్తంతా దెబ్బకి యెగిరి పోయింది.
విమానం లో సందడి అంతా సీమ టపా కాయలదే. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, తల్లి దండ్రులను నానా హైరానా పెడుతున్నారు. మనోల్లలాగా ఒక దెబ్బేస్తే, గమ్ముగా ఉండే ఘటాలు కాకపోయె. అదీ కాక, అమెరికా లో ఉన్న చట్టాల ప్రకారం, వీళ్ళను రెండు దేబ్బలేస్తే, అదేదో నెంబర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ చేసెయ్యచ్చు.ఎందుకొచ్చిన గొడవ అని, ప్లీజ్ కన్నా, కం హియర్ అని ఒకా యన బ్రతిమాలుతుంటే, హే బడ్డి, ప్లీజ్  డూ దట్ అని ఇంకో కాయన బామాలుతున్నాడు. అయినా వాళ్ళు అంత సులభం గా వింటే, విమానం లో సందడి ఏముంది.
మొత్తానికి చికాగో చేరాము.ఇప్పుడే మొదలవుతున్న చలి కాలం. విమానాశ్రయం లోనికి ప్రవేశించే ద్వారం దగ్గర ఎలా వచ్చిందో చలి గాలి గిలిగింతలు పెట్టింది.అమెరికాకు స్వాగతం నేస్తం…ఇమ్మిగ్రేషన్ పనులు ముగించుకుని బైట పడే సరికి, నా లింకు విమానం కాస్తా తుర్రున పోయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటరు లో పిల్ల యు మిస్సేడ్ ఇట్ బై  టెన్ మినిట్స్ అని పళ్లన్నీ బైట పెట్టి చెప్పింది. నా ఫ్లైట్ మిస్ ఐతే ఈమె కెందు కింత ఆనందమో…లేక టీవీ లో వార్తలు చదివే వాళ్ళలాగా అలవాటయి పోయిందేమో.సరే తల్లి ఎప్పుడు ఫ్లైట్ మల్లి అని ఏడవలేక ఒక చచ్చు నవ్వు నవ్వి అడిగాను. ఇంకో ౨ గంటల్లో అని చెప్పింది.
ఇంకేం చేస్తాం, కే.ఎఫ్.సి లో ఏదో కొన్ని వేపుడు దుంపలు, మరి టొమాటో సాసు తలగేసు కొని కుర్చీ లో కూల బడ్డాను.ఇంత బతుకు బతికి అన్నట్టు, యెంత మొనగాడైనా, ఈ దేశం లో ఈ చెత్తంతా  తినాల్సిందే…ఎదవ జీవితం
పక్క సీట్ లో ఒక తెలుగు అమ్మాయి. వాళ్ళ స్నేహితులు.కార్తిక మాసం అంట…యేవో పళ్ళు,దుంపలు తెచ్చుకుంది.ఆహ ఏ దేశమేగిన, యందు కాలిడినా, తల పాగా తీసి గౌరవించాల్సిందే ఇలాంటి వాళ్ళని  ( హాట్స్ ఆఫ్ కు నా తెలుగీకరింత…పోయిన టపా లో మిత్రుల కోరిక మేరకు,సాద్యమైనంత వరకు తెలుగు లోనే రాద్దామని చిన్న ప్రయత్నం 😉 )
డిట్రాయిట్ చేరే టప్పటికి ౫ అయింది. బ్రతుకు జీవుడు ..ఇక హోటల్ కెళ్ళి బజ్జుంటాను అని లోపల్నించి గోలేట్టేస్తున్నాడు. లగేజు చూద్దును కదా..ఒక బాగు మిస్సింగ్…ఎయిర్ లైన్స్ వాళ్ళను అడిగితె, ఇదేమన్న కొత్తా అన్నట్టు మొహం పెట్టి, వచ్చే ఫ్లైట్ లో రావచ్చు ఇంకో గంట పడుతుంది, లేకుంటే, ౨ రోజుల్లో మీ అడ్రస్సు కు పంపుతాము.అన్నది.ఏమి చేస్తాం, ఇంకో గంట వెయిటింగ్ అన్న మాట.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర ( యు.ఎస్.ఏ లో ఉన్న మన తెలుగోళ్ళ సంతతి ని చూసి కళ్ళు కుట్టి, మా తమిళ కొలీగు చేసిన కామెంట్) లో తెలుగోల్లకేం తక్కువ.మళ్ళా ఒక తెలుగాయన.డిట్రాయిట్ లో కన్సుల్టేన్సీ ఉందట.అక్కడే పరిచయం అయ్యాడు. కాసేపట్లోనే, ఇది వరకు జాబు మార్కెట్, ఇప్పుడు పరిస్తితి అదీ ఇదీ అని బాగా ఊదర కొట్టేసాడు.ఎంతలా అంటే ఇంకాసేపుంటే నేనే హెచ్౧ కి అప్లై చేసేటట్టు అబ్బే చాల ఈజీ అండీ…మా ఆఫీసు లో నిన్ననే ౪ హెచ్ ౧ లు చేసాము. అన్నాడు.నా వివరాలు కనుక్కున్నాడు.ఫోన్ నెంబర్ తీస్కున్నాడు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి కలుద్దాం బ్రదర్ అన్నాడు. అమాయకున్డను, నిజమే అనుకుంటిని, ఇంత వరకు మాట మంతీ లేదు. నా నెంబర్ తీస్కున్నంత తొందరగా మీ కార్డు ఇస్తారా అన్నా స్పందించలేదు. అబ్బే మీ నెంబర్ ఉంది గా..నేనే పిక్ చేస్కుంటాను…అని వాగ్దానం చేసాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు రావటం తో బాయ్ చెప్పి బయలు దేరాడు. అంటే, అయ్యవారికి మంచి టైం పాస్ గాడు దొరికాడన్నా మాట ( నాక్కా దండోయ్   ).
ఇంతలో నా బాగేజు రావటం తో ప్రాణం లేచొచ్చి నట్టయ్యి, వడి వడి గా బైట పడి,హోటల్ చేరాను.
అదండీ, ఈ సారి నా ప్రయాణం లో పదనిసలు, అపసవ్యం గా గార్ధభ రాగం లో సాగాయి…మళ్ళా ఇంకో టపా లో  కలుద్దాం…ప్రస్తుతానికి ఇటు అటు కాని టైం జోన్ లో నా నిద్రా ప్రపంచం లో తిరుగాడుతున్నా …డోంట్ డిస్టర్బ్…

అమెరికతలు….

నవంబర్ 25, 2010
౨౦ నవంబర్ ౨౦౧౦.
అమెరికా కు మరో ప్రయాణం.అమ్మ, నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ విమానాశ్రయం కి నాతొ పాటు వచ్చారు.వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే అమ్మ కళ్ళలో చెమ్మ.మొదటి సారి నాది అదే ఫీలింగ్.ఇంతకూ ముందెప్పుడూ ఈ ఫీలింగ్ లేదు.ప్రయాణాలు కొత్త కాకున్నా, ఈ సారెందుకో ఎప్పట్లాంటి ఉత్సాహం లేదు. ఉద్యోగ పరం గా, ఆర్దికం గా ఈ ప్రయాణం ఏంతో ముఖ్యమైంది కావచ్చు.కాని, వ్యక్తిగతం గా ఏదో కోల్పోతున్న ఫీలింగ్.అక్కడ సంపాదించేది, ఇక్కడ కోల్పోతున్న దాని కన్నా తక్కువేమో, ఇది నష్టం వచ్చే వ్యాపారమేమో…
చెక్-ఇన్ లో ఎక్కువ బరువున్న బాగేజీ నన్ను వెక్కిరించింది.డు ఐ నీడ్ టు పే ఎనీ తింగ్? అర్ధోక్తిలో అడిగాను. ౨ కిలోలకి ఏమి కదతారులే? జవాబు కూడా అర్దోక్తి లోనే ఇచ్చింది కౌంటర్ లో అమ్మాయి. మొత్తానికి  కొంచెం ఎక్కువ బరువున్న ఆవకాయ పచ్చడి పాస్ అయిపొయింది.ఇమ్మిగ్రెషున్ ముందు యౌజర్ చార్జి కౌంటర్. కట్టి మూడేళ్ళు దాటిన విమానాశ్రయం కి ఇప్పుడు ఈ తద్దినము ఏమిటో ఏలిన వారికే తెలియాలి. తెనాలి రామ లింగ సినిమాలో చాకలి రంగడు అన్నట్టు, ఏలినోల్లు చల్లగా చూస్తె ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, అదీ సంగతి. 

కాని ఇక్కడో కొసమెరుపు.ఎయిర్  ఇండియా వాళ్ళు రాత్రి ౧౨:౩౦ కి అఘోరించిన మిస్సేడ్ కాల్ కి ఉత్సాహవంతుడనగు టచే నేను కాల్ బ్యాక్ చేసి ఈ విషయము కనుక్కున్నాను కాబట్టి, తగు పైకము సమర్పించ గలిగితిని.నా వుత్స్తాహవంతులు కాని జనం అక్కడ బిక్క మొహం వేసినారు.౮౫౦ రూప్యంములు తక్కువ రొక్కము కానీ చేతనను, సదరు విమానాశ్రయం వారు చిల్లర దుకాణము వాని వలె డెబిట్/క్రెడిట్ కార్డులు అంగీకరించని కారణమున, ఆ కౌంటరు నందు రాజకీయ సభకు జన సమీకరణ చేసి నట్టు జనం పోగయినారు.నేను కట్టను అని భీష్మించే వాళ్ళు కొందరైతే, బాబ్బాబు ఎంతో కొంత తీస్కోన్డురూ అని బతిమాలేవాళ్ళు కొందరు.గ్రంధి గారి మంత్రాంగం వాళ్ళనేమీ చేసారో మరి. 

ఇమ్మిగ్రేషన్ లో ఇంకో చిత్రం. డ్యూటీ దిగిపోయ్యే హడావుడి లో ఉన్న మహాతల్లి, వర్క్ వీసా మీద కొట్టాల్సిన ముద్ర విసిటర్ వీసా మీద కొట్టింది. ఆమె విసిరేసిన తర్వాత పీ.ఎస్.ఎల్.వీ రాకెట్టు వలె నా పైకి దూసుకొస్తున్న పస్స్పోర్టు ను స్లిప్స్ లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్ పట్టినట్టు ఒడుపుగా పట్టి, ఆ తప్పు గమనించి కౌంటరు మూసి వడివడి గా వెళ్తున్న ఆమె వెంట బడి అడిగితె అదేమీ కాదు లే, అమెరికా వాళ్ళు చూసే వేస్తారు వాళ్ళకు చెప్పు అని అభయం ఇచ్చింది.
ఎంతైనా వాళ్ళమీద యెంత గురి.డిల్లి నుంచి బిల్లి లు తిరిగే గల్లిల దాక..హతోస్మి.
ఇక విమానాశ్రయం లో తినదగ్గ పదార్దాలున్న ఒకే ఒక పూటకూళ్ళ ఇంట్లో ఒక్కొక్కింటి ధర ౨-౩ డాలర్లు మన కరన్సీ లో మార్చి పెట్టినారు.బైట ౫ రుప్యంములకు దొరికే ఇడ్లి ఇక్కడ దాని సిగదరగ ౨౫ రూపాయలు అయి కూర్చున్నది. ప్రతి విషయం లో అమెరికా ను పోలో మని ఫాలో అయిపొయ్యే మన జనం ఇందులో ఎందుకు కారు. పెద్ద పెద్ద విమానాశ్రయంలలో కూడా కి.ఎఫ్.సి.,మేక దోనల్డు లాంటి వోటేలులు బైట రేట్ లే వసూలు చేస్తాయి. అబ్బే అలాంటి చెడ్డ అలవాట్లు మనకెందుకూ.
సరేలే ఏదొకటి అని సగటు భారతీయ ప్రయనీకుని లా ఆరోజు రాత్రి భోజన కార్యక్రమమును “మమ” అనిపించి,నా టెర్మినల్ దగ్గరకు వచ్చాను.నా పక్క సీట్ లో తెలుగు జంట.చికాగో వెళ్తున్నార్ష.గమ్మత్తేమిటంటే, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో ఉద్యోగి .మూడేళ్ళుగా ఉంటున్నారట.అతను డిపెండెంట్ వీసా.లేచింది మహిళాలోకం.నెత్తికి టవల్ కట్టుకుని అన్న గారు పిండి రుబ్బుతున్న దృశ్యం కాన్పించింది.
మనిషి మనిషి దీ ఒక చరిత్ర అన్నట్టు, ఇక్కడ ఒక్కక్కళ్ళ దీ ఒక్కో కధ.కొడుకులు,కూతుళ్ళ దగ్గరకెళ్ళే పెద్దోళ్ళు,మొగుళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే పెళ్ళాలు,విద్యార్దులు ఉద్యోగార్దులు ఒక్కరేమిటి రక రకాలు.
౯ కి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మామూలు గానే ౨ గంటలు ఆలీసమైనాది. జనం పిచ్చ పాటి మొదలెట్టినారు.విజయవాడ  రంగా రావు ౧౦ ఏళ్ళుగా వేర్మౌంట్ లో స్తిర పడ్డ దరిమిలా,వనస్తలిపురం నుంచి మొదటి సారి  అమెరికా వెళ్తున్న వెంకట్ రావు కు అక్కడి డ్రైవింగ్ లైసెన్సు దాని కధ కమామీషు ఊదర గొట్టేస్తున్నాడు.గుడివాడ గుర్నాధం వాళ్ళ అమ్మాయి ని చూసి రావటానికి బైలుదేరాడు.అక్కడ ఆడంగులు మందు సిగరెట్టు ఊదేస్తారషగా..అని నోరు నొక్కుకున్నాడు.బెజావాడ భోగారావు కిష్ణ భగవానుడిలా చిద్విలాసం చేస్తూ, అవన్నీ మామూలే గురూ గారు అంటున్నాడు.
ఈ చిత్రాలు చూసే టప్పటికి అదుగో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రానే వచ్చింది.రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేవయసున్న ఎయిర్ హోస్తేస్స్ “నమస్కారం” చెప్పి ఆహ్వానించింది.సరే నా సీట్ లో కూర్చున్నాను.విమానం బైలు దేరింది.నా హెడ్ ఫోనులో నుంచి శబ్దం రాక పొయ్యే టప్పటికి ఎయిర్ హోస్తేస్స్ ను పిలి చాను. సరిగ్గా  హోల్ లో పెట్టు అదే వస్తుంది. విసురు గా చెప్పి విసా విసా వెళ్లి పోయింది.ముసలావిడ కు చాదస్తం అంటే ఇదే నేమో.నా పక్క సీట్ లో పెద్దాయనకు ఫోను లేదు సీట్ లో ఉండాల్సిన సాకెట్టు లేదు. గొడవ లేని పని.
చూస్తుండ గానే ఢిల్లీ చేరాము.మళ్ళా సెక్యూరిటీ చెక్కు.బ్రతుకు జీవుడా అని రాత్రి ౨:౩౦ గంటలకు చికాగో వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.   మిగతా సంగతులన్ని ఇక్కడ పట్టవు కాని మల్ల చెప్తా..

సృష్టి లో తీయనిది స్నేహమేనోయి..

నవంబర్ 16, 2010
అనుకోకుండా ఒక ఆవకాశం…యు ఎస్ వెళ్ళడానికి…౨-౩ వారాల్లో అంతా ఓ కే అయ్యింది. అంతా చేసి ౨ వారాలే టైం ఉంది..హడావుడి గా మా వూరు బయలుదేరాను.. అమ్మను చూసిరావడానికి..ఆమెకు ఇంకా ఈ విషయం తెలీదు. మా అక్కకు చెప్పాను కొంచెం ముందు నుంచే ప్రిపేర్  చెయ్యమని. అమ్మకి నేను వెళ్ళడం ఇష్టం లేదు.అందుకే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా కొంచెం నా వైపు నుంచి అనుకూలం గా మాట్లాడి కన్విన్సు చెయ్యమని చెప్పాను.ఇంట్లో పరిస్తితి కొంచెం సానుకూలం గానే కనపడింది.
ఆ రోజు దీపావళి. మా అక్క కూతురుదే ఇంట్లో హడావుడి. ఆ వయసులో మనము అంతే నేమో. పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి తనకు టపాకాయల ద్యాసే..అవన్నీ చక్కగా పేపర్ మీద పేర్చి, ఎండ లో పెట్టింది. నేను రానను కున్నారేమో  మా నాన్న నాకు టపాకాయలు తాలేదు. దానికి అది చేసిన రాద్దాంతం ఇంతా అంతా కాదు. మా నాన్న మల్ల బజారు కెళ్ళి నా కోటా టపాకాయలు తెచ్చేదాకా ఆయన పైన రాజి లేని పోరాటం చేసింది. నేను తనని అడిగాను, ఏమిటే నీ గోల అని..దానికి అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..మరి నువ్వు నా టపాకాయలన్ని   కాల్చేస్తేనో అని.
కొంచెం రెడీ అయ్యి,నేను అలా బజారు దారి పట్టాను..మద్యలో గుడి దగ్గర కొచ్చేటప్పటికి ఒరేయ్ ఎప్పుడొచ్చావ్ అన్న పిలుపు విని వెనక్కు తిరిగి చూసాను. మా డిగ్రీ దోస్తులు ఇద్దరు కనపడ్డారు.
చిన్నగా మా గ్రంధాలయం మెట్ల మీద కూలబడ్దాం. మా డిగ్రీ దోస్తుల గురుంచి వాళ్ళవాళ్ళ ఉద్యోగ సద్యోగాల గురుంచి, పెళ్లి ఐన వాళ్ళ కధాకమామీషు నుంచి పెళ్లి కాని ప్రసాదుల వరకు అన్ని మాట్లాడుకున్నాం. అదుగో ఒంటి గంట ఐంది. మల్లా కలుద్దాం అని భారం గా ఇళ్ళకు బయలుదేరాం.
కలిసి మెలిసి తిరిగిన మేము రకరకాల కారణాల వల్ల వేరైనప్పటికి ఆ రోజులు నెమరు వేసుకుంటే, ఏదో గొప్ప ఫీలింగ్. ఏ బాదర బందీ లేకుండా, కాలేజీ ల దగ్గర్నుంచి,కొత్త సినిమా రిలీజ్ ఐన హాల్స్ వరకు, ట్యూషన్ పాయింట్ల నుండి బాబా గుడి వరకు అంతా మాదే హల్చల్. ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకాలు.అందరితో కలిసున్నా, మా తొట్టి గ్యాంగ్ లో ౬  గురం. బాషా,నేను,బ్రంహం,కరీం,సురేంద్ర,రాంబాబు. మా స్నేహానికి మొదటి మెట్టు ట్యూషన్ పాయింట్. చివరి వరసలో మాకు చాల స్వతంత్రం ఉండేది. పంతులు గారిపై సెటైర్లు వెయ్యడం మొదలు, పక్క వరసలో అమ్మాయిల మీద కామెంట్ల దాక వెనక వరస వాళ్ళదే ముందడుగు. అలా అని కోతి గుంపు అని జమ కట్టేయ్యకండి. మేము రొజూ పోటీలు పడి చదివే వాళ్ళం. కాలం తో పాటు మా స్నేహం మరింత దృడ పడింది.
ఫైనల్ ఇయర్ లో మాకు ఇంకా మంచి పోటి ఏర్పడింది..అయినా అది కేవలం చదువుల వరకే పరిమితం. బ్రంహం కి జ్వరం వస్తే వాడి నోట్స్ రాసి పెట్టడం, ౪ ఏళ్ళ నుంచి బాష లైన్ వేస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వటానికి తోడూ వెళ్ళడం, తర్వాత రోజు వాళ్ళ అన్న మమ్మల్ను వెతుక్కుంటూ వస్తే, పక్క వీది లోనుంచి శివ సినిమాలో సైకిల్ చేజ్ లాగ బైట పడటం అన్ని గుర్తొచ్చాయి.ఆ జ్ఞాపకాలు గురుతులు నన్ను పలకరించాయి 

ఆనాటి ఆ స్నేహమానంద గీతం అని పాడాలని పించింది. సరే అల్లాగే ఇల్లు చేరాను.మా ఇంటి ముందు అప్పుడే ఆగిన ఆటో నుంచి దిగిన పర్సనాలిటీని చూసి ఉబ్బి తబ్బిబ్బైనాను. మధు. మా మేనత్త కొడుకు. వాళ్ళు మా వూరు నుంచి ౨౫౦ కి.మీ. దూరం లో ఉంటారు.తను వ్రుత్తి రీత్యా బళ్ళారి లో ఉంటాడు. తన వైఫ్ ఇక్కడే ఉద్యోగం చేస్తుండటం తో పండగకు పబ్బానికి తనకు తప్పని ప్రయాణాలు..తనకు నేను మా వూరు వస్తున్నట్టు తెలుసు..కాని తనకు కుదరదని చెప్పాడు .వాడికి ఇద్దరు పిల్లలు.. పెద్దోడు చాల గోడవేట్టేస్తున్నాడు రా.. ఈ సారి నిన్ను కలవటం కుదరదేమో…వాడి గొంతులో ఏదో మూల చిన్న బాధ..పర్లేదు లేరా..మల్లా కలుద్దాం..అయినా ఫోన్ లో రోజు మాట్లాడుకుంటాం కదా..పెద్ద ఆరిందా లాగా నా ఓదార్పు. నన్ను చూడగానే అన్నాడు, మల్లా ఎన్నాళ్ళకు చూస్తానో అని వచ్చేసాను రా..అని.
నేను చాల ఆనంద పడ్డాను.నేను జీవితం లో ఏదైనా దాచకుండా చెప్పానంటే అది వాడికే. వాడు ఇంకా ఒక అడుగు మున్డుకేసాడు.ఇంట్లో ప్రతి చిన్న పెద్ద విషయం నాతొ చెప్పుకొని స్వాంతన పొందటం నాకు తెలుసు.మా స్నేహం మాకు ఊహ తెలిసినప్పటిది. నాకు మొదటి స్నేహితుడు వాడు…
వాళ్ల పిల్లల చదువులు ఆరోగ్యాలు,వాడి ఉద్యోగం ముచట్లు అన్ని తెలుసుకుంటూ భోంచేసాము. 

రాత్రి కుదుపుల ప్రయాణం మమ్మల్ని చక్కగా నిద్ర పుచ్చింది.వాడిని బస్సు స్టాండ్ లో వదిలి రావటానికి బైలు దేరాను.కేవలం నన్ను చూడ్డానికే కుటుంబం తో పండగ సంబరాలను  వదులుకొని వచ్చిన వాడికి నేనేమివ్వగలను…స్వచ్చమైన స్నేహం తప్ప.వాడితో కొంచెం సమయం గడపటం తప్ప. చిన్నగా నడవటం ప్రారంభించాం.అది కూడా వాడితో ఇంకొంచెం సేపు గడపాలని చిన్న ఆస వల్ల. మా ఇద్దరికీ మా వూరు తో ఎన్నో జ్ఞాపకాలు..ప్రతి వీది ప్రతి మలుపు ఏదో ఒక ఊహను తట్టి లేపుతాయి.అది ఇదీ మాట్లాడుకుంటూ మొత్తానికి బస్సు స్టాప్ చేరాము.
వాడికి ౪ గంటల బస్సు. అది దాటితే మల్లా ఇంకో గంట దాక బస్సు లేదు. ౩:౪౫ కి బస్సు స్టాండ్ చేరాము. కరెంటు బూకింగ్ లో టికెట్ తీస్కోని ప్లాట్ ఫారం మీద కొచ్చాము. మా మాటలు సమయా భావం చూసుకోలేదు. కాసేపటికి అర్ధం అయ్యింది, మేము మాట్లాడే విషయాల వెనుక కేవలం వాడితో ఇంకా సేపు గడపాలనే ఉద్దేశ్యమే ఉందని.ఒక వైపు వాడికి ఆలస్యం అవుతుందని తెలుస్తున్నా నేను ఆసక్తుడనయ్యాను.ఇంకో అర్ద గంట గడిచింది. అప్పుడే వెళ్తావా నేస్తం, మల్లా ఎప్పుడు కనపడతావో,నీ మాటలు వినే అదృష్టం నీతో గడిపే ఆ కాస్త సమయం మల్లా ఎప్పుడు దొరుకుతుందో..ఇదే భావం ఇద్దరిలో…నేనే ఆ ప్రవాహాన్ని ఆపాను.నాకు తెలుసు, తన వైఫ్ పిల్లలు తన గురుంచి ఎదురు చూస్తారని. సరే మరి ఉంటా అన్నానే కాని వాడి మొహం లో దోబూచులాడిన  భావం నన్నిక మాట్లడనీయ లేదు. వాడు వెంటనే సర్దుకున్నాడు. నాకని పించింది..నా మొహం లో కూడా అదే ఫీలింగ్ ఏమో..బస్సు వైపు భారం గా కదిలాడు. టాటా చెప్తు చెయ్యి పైకెత్తాను.  ఆలాగే సగం లో ఆగిపోయింది. 

మృతిలోన ముగిసినా చితి లో న రగిలినా కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎద వీది పోనిది మమతాను రాగం…
ఎప్పుడో విన్న చిన్న కవిత చెవుల్లో మారు మోగింది…