Archive for జూలై, 2010

నిన్న..నేడు…

జూలై 18, 2010
నిన్న పొద్దున్నే లేవగానే, మళ్ళీ తెల్లారిందా అన్న భావం వచ్చేది.మల్లా అదే దరిద్రగొట్టు ఆఫీసు, అవే తొక్కలో పనులు……ఏదో రెడీ అయ్యాం అనిపించి రోడ్డు మీద పడితే, ఆఫీసు టైం లో
ట్రాఫిక్ సంగతి చెప్పేదేముంది…హాయి గా కార్లో పోదాం అంటే,పెట్రోల్ ధర ఆకసాన్నంటుతుంది. ఆ పెద్దాయన్ని గడ్డం లాగి, వీపు మీద నాలుగు గుభి,గుభి మని కుమ్మాలని పిస్తుంది. సరే,ఏ షేర్ ఆటో లోనో కూలబడితే, మన అదృష్టానికి తోడూ,ఎవరో మగానుభావుడు(మా తమిళ కొలీగు ఇలాగే అంటాడు)  అదే టైం కి ఎక్కడికో బయలుదేరతాడు. వాడి కోసం, మన అటు ౪ కి.మీ. ఇటు నాలుగు కీ.మీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఆఫీసు కెళ్ళే వాళ్ళ బాధలు పట్టవా…అయినా,కాస్త ఆఫీసు టైం తర్వాత బయలు దేరచ్చు కదా. ఆ కార్లోంచి బైటకి లాగి బుర్ర రామ కీర్తన పాడిస్తేనా…నా సామి రంగా..ఆయన వల్ల  ౧/౨ గంట లేటు….ఆఫీసు భవనం చూడగానే మల్లా వచ్చేసామా, ఏదైనా సునామి వచ్చి ఇదెందుకు కొట్టక పోదురా భగవంతుడా,  ఎదుట మా మానేజరు, గుడ్ మార్నింగ్ చెప్తే, ఒక సగం నవ్వు నవ్వారు. లేటుగా వచ్చావు అని చెప్పడమేమో…ఆ నవ్వు భావమేమి మల్లిఖార్జునా….

ఇక పని, నా డెస్క్ కొన్నేళ్లుగా ఎవరు క్లీన్ చెయ్యలేదేమో, ఇలాంటి చోట పని చేస్తే ఎలర్జీలు ఖాయం..ఇక సిస్టం ఆన్ చెయ్యగానే, పని పని పని…ఎప్పటికి తరగని పని..ఆన్ సైటు  వాడికి మనం పంపినదేమి నచ్చదు..ఇలా కాకపొతే అలా అలా కాకపొతే ఇంకో లా అని, వీడి దుంపతెగ.. రోజుకో తొక్కలో కొత్త పని, రోజుకో ఫార్మాటు….మల్లి చేసి, తిప్పి తిప్పి చేసి, అదే చేసి..అసంతృప్తి ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడేమో…ఇక మన వాళ్ళ సంగతి…మహా సీనియర్ ఒకాయన..ఉలకడు..పలకడు..బంగారం షాప్ పక్కన మురుగు కాలవలో బగారం రజను వెతికే వాడిలా, ౨౪ గంటలు ఆ మోనిటర్ లో మొహం పట్టుకుని ఉంటాడు..ఏదన్నా సందేహం వచ్చి అడిగితె, ఇది కూడా తెలియదా అన్నట్టు చూసి, నేను బిజీ రేపు డిస్కస్ చేద్దాం అంటాడు…ఆ రేపు ఎన్ని సినిమాల్లో రేపులైపోయినా రాదు..ఇంకా మన కింద వాళ్ళ సంగతి…వాడు సీట్ లో కన్నా, కాంటీన్ లో ఉప్పర మీటింగుల్లో ఎక్కువ పని చేస్తాడు…ఇలాంటి వాడి చేత పని  చేఇంచ దానికి బిన్ లాడెన్ రావాలేమో… ఈ కంపెనీ ని దేవుడే కాపాడాలి…ఇక మా మీటింగులు…వాళ్ళు అడిగే ప్రశ్నలకి, ఈ జీతానికి ఇంతే పని అని గట్టి గా అరవాలనిపిస్తుంది..

ఇంకా నేడు..కొంచెం రెఫ్రెషింగ్ గా అనిపించింది..పొద్దున్న లేవగానే…ఏదో తెలియని ఉత్సాహం…గభాలున రెడీ అయ్యి, బయలు  దేరాను ఒక అరగంట ముందే…అదే కలిసొచ్చింది..కరెక్ట్ గా టైం కి ఆఫీసు చేరాను..నిన్న వాన పడ్డదేమో…దానిదెబ్బకి, బాగా క్లీన్ అయి పోయి, ఇప్పటి ఎండ కాంతి లో మిల మిలా మెరిసిపోతుంది..మా ఆఫీసు భవనం…ఎవడు కట్టాడో కాని మంచి అభిరుచి…..

మా మానేజరు..నేను గుడ్ మార్నింగ్ చెప్పినా తల పైకేత్తలేదు…బిజీ గా ఉన్నాడేమో..ఆన్ సైట్ వాడు,కొత్త చెత్త పని పంపాడు…పాపం దేశం కాని దేశం లో ఆ తెల్లోళ్ళ మద్య యెంత కష్టపడుతున్నాడో బిడ్డ…నా జేబులో కర్చీఫ్ తీసి మోనిటర్ ని సుబ్రం గా తుడిచాను. నా స్క్రీన్ మద్య లో ఎప్పుడూ కాన పడే పెద్ద చుక్క..మోనిటర్ ప్రాబ్లం వల్ల కాదని అప్పుడే తెలిసింది..నా పక్కన సీనియర్ ఏదో అడిగితె మళ్ళా రేపన్నాడు..ఆ రేపు కోసం ఎదురు చూడాల్సిందే..పాపం చాల కిందా మీద పడుతుంటాడు..ఆయనకీ, టైం ఉండాలి కదా..ఇక మా కింద వాడి ని కాంటీన్ లోనే పట్టుకుని, ఏమి చెయ్యల్లో బాగా డిస్కస్ చేశా…ఆ చిప్స్ కరకర లో ఏమి విన్నాడో..ఏమో…అయినా కొత్త వాడు కదా..కొంచెం టైం పడుతుంది…వీడు జనజీవన స్రవంతి లో కలవడానికి…

వీడి సిగ తరగా…వీడికేం పొయ్యేకాలం వచ్చింది..ఇందాకటి దాక బానే ఉన్నాడు గా అందర్నీ తిట్టు కుంటూ…అనుకుంటున్నారా…

ఈ రోజే మాకు ఇంక్రిమెంట్ వచ్చింది లెండి…

టాల్ స్టాయ్ -కోసక్కులు

జూలై 13, 2010
మొన్న పుస్తకాలు సర్దుతుంటే కనపడ్డది ఆ పుస్తకం.చిన్నదే  ఐన పొందికైన అట్ట.చూడగానే ఆకర్షనీయం గా, పోనిలే ఒకసారి చదువుదూ అన్నట్టు  ఉంటుంది. పైన కోసక్కులు అన్న పేరు,మధ్యలో చేతులు కట్టుకుని చదువు తావాలేదా అన్నట్టు  చూస్తున్న బరివి గడ్డం తాతయ్య.కింద ఆయన పేరు..ఇంకెవరు నా అల్ టైం ఫేవరేట్ టాల్ స్టాయ్.
 
రష్యా పుస్తకాలతో నా పరిచయం నా చిన్నప్పటిది.మా నాన్న కమ్యునిస్టు భావాలను గౌరవించేవారు.ఆ భావ జాలానికి అనుగుణంగా ఎప్పుడైనా రష్యా బుక్ exhibition వస్తే నాన్న రక రకాల పుస్తకాలు తెచ్చేవారు.వాటిలో చిన్న పిల్లల కదల పుస్తకాల నుండి, రష్యా చరిత్ర, విప్లవం మొదలైనవి కూడా ఉండేవి. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చే మా మధు బావ గాడికి నాకు ఈ పుస్తకాల దగ్గర డిష్యుం డిష్యుం జరిగేది.
 
ఇక కోసక్కుల విషయాని కొస్తే, నేను డిగ్రీ లో ఉన్నప్పుడు అనుకుంటా..ఒక బుక్ exhibition  లో చూసాను. అప్పటికి సోవిఎట్ విచ్చిన్న మై పోయింది.అలాంటి పుస్తకాలు రావటం ఆగిపోయింది.ఏదో పాత పుస్తకాల వరసలో కాన పడ్డ టాల్ స్టాయ్ తాత నన్ను పలకరించాడు.వార్ అండ్ పీసు లాంటి నవలలు రాసాడని తెలుసు కాబట్టి గబాల్న కొనేసాను.అదే నేను ఆయన పెద్ద అభిమాని అవటానికి ప్రారంభం అవుతుందని నాకు తెలియదు.
ఈ కదా ఒక చిన్న లవ్ స్టొరీ. ఒలేనిన్ అనే మన హీరో, మంచి డబ్బున్న కుటుంబం లో పుడతాడు.మాస్కో లో బాగా అప్పులు చేసి, ఎవరికి మొహం చూపించడం ఇష్టం లేక ఆ అప్పులు తీర్చడానికైన అన్నట్టు అర్మి లో చేరతాడు. కావాలని ఆ వూరు నుంచి దూరం గా పోదామని దేశ పోలిమేరల్లో పోస్టింగ్ తీసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ తన దోస్తులకు చిన్న పార్టీ ఇస్తాడు.ఈ సందర్భం లో ఆ సన్నివేశాలు, బార్ లో దృశ్యాలు,బైట గుర్రబ్బండి వాడి పాట్లు,ఒలేనిన్ పూర్వ పరిచయాల్లో తలుక్కున మెరిసే మాస్కో అందగత్తెల గురించి రచయిత వర్ణన కళ్ళకు కడుతుంది.ఇక ప్రయాణం పొడుగునా అతని మనఃస్తితి,దోబూచులాడే పాత సంగతులు, రా రమ్మని పిలిచే పర్వత శ్రేణులు, విశాల మైన దేశము లో పోలి మేరలదాక సాగే ప్రయాణం చదవదగ్గవే.
 
 
ఇక అసలు కధ విషయాని కొస్తే, మన హీరో ఒక చిన్న కుగ్రామం లో పడతాడు. అక్కడి అనాగరిక జాతి పేరు కోసక్కులు. పొలిమేరలు రక్షించే సైన్యం లో వాళ్ళ జనాభా ఎక్కువే. అక్కడి జనం, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆర్దిక తారతమ్యాలు, రచయిత కళ్ళకు కట్టిస్తాడు. హీరో ఉన్న చిన్న ఇల్లు అక్కడి గ్రామ పెద్దది. ఆయన, ఆయన పెళ్ళాం మన హీరో ని చూసి ముచ్చట పడతారు. మన హీరో వాళ్ళ అమ్మాయి ని చూసి ప్రేమ లో పడతాడు. మొరటుగా, పొలాల్లో పనిచేసి ఆ పిల్ల పొగరు, బింకం మన హీరో గారికి బాగా నచ్చేస్తాయి. ఆ పల్లెటూళ్ళో మంచి కాలక్షేపం ఒరేష్కా.ఎప్పుడో సైన్యం లో పనిచేసినా ఆ ముసలాయనకు నవల పోడుగూతున తాగటం వేటాడటం తెప్ప వేరే పని ఉన్నట్టుకన పడదు. మన హీరో భావాలు పసిగట్టి, ప్రోత్సహిస్తాడు,మంచి supporting  charector అన్నమాట.ఇక హీరోఇన్ విషయానికొస్తే ఆ పిల్ల కు లూక అనేవాడి మీద మనసు. ఆ వయసుకు తగ్గ చిలిపితనం తో ఒలేనిన్ ని కొన్ని సార్లు ప్రోత్సహిస్తున్నట్టు కనపడ్డా,ఎక్కడా మనసు పడ్డట్టు అనిపించదు.
 
ఇవన్ని అర్ధం అయ్యాక మన హీరో గారు డల్ ఐపోతారు.మనసులోనే తన ప్రేమ ను దాచుకుంటాడు. ఇవన్ని మరిచి పోవటానికి మరింత తాగుడు కి , ఎరోష్క తో వేట కి బైలు దేరతాడు. కాని మద్యలో దారి తప్పుతాడు.నిర్జన మైన అడవి లో ఎటు పోవాలో తెలియని స్తితి లో తన పరిస్తితి గురించి ఆలోచిస్తాడు.
ఇక్కడ, ౨-౩ పేజీలు చాలండి, ఒక రచయిత యెంత విషయం ఉన్నవాడో చెప్పటానికి.టాల్ స్టాయ్ ఆ అడవి ని వర్ణించే విధానం,ఆ ప్రపంచం లో ఆ నిర్జనారణ్యం లో అతను యెంత చిన్న వస్తువో అన్న భావం హీరో కు స్పురిస్తుంది.తన బాధ క్షణభంగురం అని, జీవితం చాల విశాల మైన దాని, అతనికి జ్ఞానోదయం అవుతుంది.ఇలాంటి వర్ణన , ఆ రచన లో  పట్టు చదవాల్సిందే కాని వర్ణించలేము. ఆ పేజీలు నేను ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
 
ఇక ఉపసంహారాని కొస్తే, ఒలేనిన్, ఆ ప్రాంతాన్ని ఒదిలి దూరం గా పోతాడు. అది వ్రుతిరీత్యా అని మిగిలిన పాత్రలు నమ్మినా, కేవలం హీరొయిన్ నుంచి దూరం గ వెళ్ళే ప్రయత్నం అని మనకు తెలుస్తూనే ఉంటుంది. మల్లా ప్రయాణం మొదలవుతుంది. మల్లా అవే దారులు, అవే దృశ్యాలు, అవే పర్వత శ్రేణులు…
 
జీవితం గొప్పతనం చాటి చెప్పే ఈ నవల, బాధలన్ని చిన్నవే అంటుంది. టాల్ స్టాయ్ సొంత కధ అని ముందు మాటలో ఎవరో అన్నారు. అదీ నిజమే అని పిస్తుంది. ఎందుకంటె, ఈ నవల ఒక దృశ్య కావ్యం. సొంత అనుభావాలుంటే కాని, ఎవరు అలా రాయలేరేమో….

జరా బద్రం అన్నో…

జూలై 3, 2010
చిన్నప్పుడు చదుకున్న పంచతంత్రం కధ.ఒక వూళ్ళో ఒక సన్యాసి. ఆయన ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి అడుక్కోచ్చిన దంతా ఒక జోలె లో పెట్టి, చిలక్కొయ్య కి తగిలించే వాడట. అదే ఇంట్లో ఒక ఎలకల గుంపు. హిరణ్యకుడనే వాడు దానికి రాజు. వాడు చిన్న చిన్న గా ఆ జోలె లో పదార్ధాలు కాజేయటం నేర్చుకున్నాడు. ఆ సన్యాసి అదేమీ పట్టించు కోలేదు. ఇక ఈ ఎలకల ఆగడాలు ఎక్కువయ్యాయి.అవే ఆ ఇంటి యజమానుల్లా ప్రవర్తించడం మొదలెట్టాయి.తిన్నంత తిని మిగతాది చుట్టూ చల్లి, జోలె కు కన్నాలు పెట్టి, నానా రభస చేసాయి.
అల జరుగుతుండగా, ఒక నాడు ఈ సన్యాసి స్నేహితుడొకడు అతన్ని చూడడానికి వస్తాడు. వీనితో మాట్లాడుతున్నా, మన సన్యాసి ద్యాసంతా ఆ జోలె మీదే ఉండింది. ఆ స్నేహితుడది గమనించి, విషయం కనుక్కుంటాడు. ఏదో మాయో పాయం చేసి, ఆ జోలె ఎలుకలకు అందకుండా చేస్తాడు. ఆ దెబ్బ కి ఎలుకల రాజు కి అతని పరివారానికి తిండి దొరక్క, పలాయనం చిత్తగిస్తారు. నిన్నా ఈరోజు జరిగిన జరుగుతున్న,సంఘటనలు  చూస్తుంటే, నాకు ఈ కధ గుర్తుకొచ్చింది.
పేనుకి పెత్తనం ఇచ్చినట్టు, ఇన్నాళ్ళు ఈ జనం మన ఘనత వహించిన నాయకుల ఉన్మత్త ప్రేలాపనలు ఊక దంపుల్లు విని విని విసిగెత్తి పోయి వున్నా తరుణం లో ఈ.సి నిజం గా శభాష్ ఐన పని చేస్తుంది. రౌతు చేతగాని వాడితే గుర్రం ౩ కాళ్ళ తో పరిగెత్తి ఇంకేదో భాగం తో సకిలించిందని మనోళ్ళు ఊరకే అనలేదు. మైకు కాన పడగానే అదేదో పిచ్చి కుక్క కరిసినట్టు వాళ్ళను వీళ్ళను వీలయితే అందర్నీ ఎసేస్తాం కుమ్మేస్తాం అనే వాళ్ళకు ఇది చెంపదెబ్బ. డబ్బు మద్యం వెదజల్లి ఏదో గెలిచాం అనిపించుకొని, చట్ట సభల్లో కేవలం ప్రమాణ స్వీకారం చెయ్యడానికే వెళ్లి, మల్ల ౫ ఏళ్ళు జనాలకు కనపడని వీళ్ళు ఎక్కడుంటే ఏముంది లెండి. ప్రజాస్వామ్యానికేమీ నష్టం కలగదు.కాని జనం కొంత కామెడీ మిస్ అవుతారు అంతే….