Archive for మే, 2010

లైలా ఓ లైలా…

మే 21, 2010
తుఫాను…ప్రపంచం అంతా విస్తుపోయి టీవీ మోనిటర్ లకు అతుక్కుపోయి చూస్తుంది. మా వూరు సగం నీళ్ళల్లో మునిగిపోయిందని వార్త. యెంతో మంది మరణించారు. నిరాశ్రయులయ్యారు. కూడు గూడు కొట్టుకు పోగా కట్టు బట్టలతో మిగిలారు. ఇంకా ముప్పు తొలగి పోలేదు. ఒంగోలు చుట్టూ పక్కల సుమారు ౩౨ cm  వర్షపాతం. చుట్టూ పక్కల ౪ చెరువులు ఇప్పుడో ఇంకాసేపటికో గండ్లు పడతాయి అని అన్నారు.
ఊర్లో కరెంటు లేదు రెండు రోజులుగా. తాగటానికే ఇంట్లో నీళ్ళు లేవు. బైట మోకాలు లోతులో నీరు. ఆగకుండా వస్తున్నా కుండపోత.
ఇవన్ని బైట ప్రపంచానికి చాల పెద్ద కష్టాలే. కాని మేము వీటికి అలవాటు పడ్డాం. మా నాన్న గారు చెప్పినట్టు, ఈ వరద ఉదృతి ఇంకో రెండు రోజుల్లో తగ్గిపోతాయి.మల్లా జీవితం మామూలవుతుంది.మా ప్రాంతం తుఫానులను తట్టు కుంటున్నట్టు  , జనం కూడా ఈ పరిస్తితులకు రాటు తేలారెమో? ఏమో…ఇదొక వైరాగ్యం, నైరాస్యానికి పరాకాష్ట ఏమో..ప్రతి ఏడు వచ్చే తుఫానులు ఎదుర్కోడానికి ఏ మాత్రం పద్దతి పాడు లేవు..ఇంకా వస్తాయన్న నమ్మకం లేదు. ఏం.ఎల్.ఏ లు ఏం.పీ లు ఏ రోడ్డు ఎటు మళ్లిస్తే వాళ్ళ ( ఆక్రమించిన) భూములకు రేట్లు పెరుగుతాయో లేక్కేసుకోవటం లో బిజీ గ ఉన్నారాయే…జనం ఎలా చస్తే వాల్లకేమిటి…అంతా అయ్యాక ముసలి కన్నీరు కార్చడానికి రెడీ…మునిగిన కొంపలు, కోల్పోయిన ఉపాది, కొట్టుకు పోయిన వాళ్ళు పోగా మిగిలిన బక్క చిక్కిన జనం, పిల్లలకు పట్టడానికి పాలు కూడా లేక కళ్ళల్లో వత్తులేసుకుని సాయం కోసం చూసే తల్లులు…వీళ్ళందర్నీ పరామర్శించి శవాల మీద వోట్లు ఏరుకోడానికి వస్తారు. అదేదో వీళ్ళ కొంపలు మునిగినట్టు తెగ నటించేస్తారు…
అదే మొదట హెచరిక రాగానే వీళ్ళను తగు ప్రాంతాలకు తరలించడం, లాంటి చర్యలు తూతూ మంత్రం లానే ఉంటాయి…వీటిల్లో మన వోట్లు పక్క పార్టీ వోట్లు లాంటి తర్జన భర్జనలు తప్పనిసరి.ఇదంతా పక్కన పెడితే, ఇంత వర్షపాతం మల్లా సముద్రం పాలే…ఎన్నెన్నో చెరువులు, గుండ్లకమ్మ,వెలిగండ్ల చెవిలో పువ్వు అంటూ ఎన్నో ప్రాజెక్ట్లు, కాని జిల్లా కేంద్రానికే ౩-౪ రోజులకు ఒక రోజు నీళ్ళు. అదీ వాళ్ళ సొమ్మేదో పోయ్నట్టు పొద్దున్న ౪ గంటలకు. పొద్దున్నే లేచి జనం పడే ఇబ్బందులు చూస్తె, ఆ మల (MLA  ని అల్లాగే కొడితే ఇదే వచ్చింది లేఖిని లో 😉 ) మప్(MP ) గాల్లచేత మా వీది మొత్తానికి ఒక రోజు నీళ్ళు మోయించాలని అనిపిస్తుంది. పోనీ ఒక్కరోజైన జనం ఇబ్బందులు వాళ్లకు తెలియాలి కదా.
ఇక పొద్దున్న లెగిస్తే నిత్యావసరాలైన పాలు పప్పు ఉప్పులు కోనేటప్పటికే జనాలకు దేవుడు కనిపిస్తుంటే……దీనికి తోడూ సర్కారు జీతాలు భయంకరం గా పెరిగి పోయినా, జనం రక్తం పీల్చే మన ప్రభుత్వోద్యోగులు…(ఎవరైనా  లంచాలు తీసుకోని మహానుభావులుంటే వాళ్ళ కు శతకోటి దండాలు)…ఇవన్ని చూసి చూసి జనం రాటుదేలి పోయారు…వైరాగ్యం, వేదాంతం ఎవర్ని కదిలించినా…మనం వీటన్నిటికీ అతీతులం…ఈ లైలాలు మజ్నులు వచ్చి ఏమి చేస్తాయండి..ఒక రెండు రోజులుండి  పోతాయి…ఇంత కన్నా పెద్ద భూతాలే ఉన్నాయి జనాలు ఆలోచించడానికి…

బెంగుళూరు బస్సు స్టాండ్

మే 17, 2010
బెంగళూరు బస్సు స్టాండ్ ఏమీ మారలేదు. ౫ ఏళ్ళు అయిందేమో ఇక్కడికి వచ్చి. ఏ మాత్రం తేడ లేదు. అవే ప్లాట్ ఫోరమ్స్,అదే ఆశుబ్రత,అదేదో పెద్ద చెత్త డబ్బా లా ఫీల్ అయి పోయి చెత్త వేసే చెత్త జనం, ఆశుబ్రత వల్ల భరించలేని దుర్ఘందం. స్కూల్ వదిలేక నలు వైపులా పరిగెత్తే పిల్లల్లాగా అడ్డదిడ్డంగా పొయ్యే బస్సులు.ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా మారనిది అదే అలసత్వం,అదే నిరాసక్తత.
ప్రభుత్వాల మాట పక్కన పెడితే మన జనం ౧౦ ఆకులు ఎక్కువే చదివారు. ఎంతైనా ఎడా ప్రజా తదా రాజానే కదా.
ఒకచోట స్తిమితంగా కూర్చోడానికే చాల ఇబ్బంది పడాల్సివచ్చింది.నన్ను తోసుకుంటూ వెళ్ళిన ఒకాయన, వెనక్కితిరిగి అదేదో భాషలో, ఇంకేదో అని విస విసా వెళ్లి పోయాడు, అది సారీ కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఇంకో మహానుభావుని నోటి పళ్ళ మద్య భాగం నుండి, విచిత్రమైన శబ్దం చేస్తూ బయల్పడిన ఘుట్కా ఫౌంటైన్ నా కాళ్ళను కొంచెం మిస్  చేసి నేల నిండా పరుచుకుంది. కొంచెం సీరియస్ గానే తలెత్తి చూసాను. కొంచెంలో మిస్ అన్న ఫీలింగ్ కనపడింది ఆయన గారి మోహంలో.ఇక చెత్త తీస్కేల్లే బండి నుండి కారిన జల పదార్ధం మేకేన్నాసు గోల్డ్ కి దారి చూపే మ్యాప్ గీచినట్లు చాల దూరం పారింది.నా పక్కన కూర్చున్న భారి ఫ్యామిలీ ఫలహారం చెయ్యడం మొదలెట్టారు..ఇంకా చూస్కోండి నాయనా, ఇక చుట్టూ పక్కల ఎటు చూసిన తిని పారేసిన స్నాక్ పాకెట్లు,తాగి పారేసిన కాఫీ కప్పులు,అక్కడే ఇంకో అరగంట వుంటే,ఆ చెత్త సముద్రంలో మునిగి పోతానన్న చెత్త ఫీలింగ్ రావటంతో,అతి కష్టం మీద దొరికిన సీట్ ను వదిలి, అయిష్టం గా నైనా మెకన్నాస్ గోల్డ్ మ్యాప్ అనుసరిన్చాల్సివచ్చింది.తపక్ మని నెత్తిమీద ఏదో పడటం తో తలెత్తి చూసాను.పై కప్పు కారుతుంది. ఆ ద్రవ పదార్ధం రసాయన విశ్లేషణ మానేసి, శుబ్రం చేస్కో టానికి toilet  లో దూరాను. అక్కడ చూడాల్సిందే, అదేదో చిరంజీవి సినిమా మొదటి ఆటాకు ఉన్నట్టు ఉన్నారు జనం. ఇక లోపల పరిస్తితి చెప్పుకోదగిందే.నేలంతా రక రకాల సువాసనలతో తడి తడి గా ఉంది.అదేవిటో ఇదేవిటో అంటే ఈ బ్లాగ్ గబ్బు కొడుతుందని, గబా గబా పని ముగించుకొని బైటకు వచ్చాను.
ఇక ఇక్కడి ప్రభుత్వ ఘనత. కొన్ని ప్లాట్ ఫోరమ్స్ కి చెత్త డబ్బాలే లేవు. అవి ఉంటేనే,మనోళ్ళు వాటిని వాడటం బహు అరుదు. ఇక లేని చోట్ల పరిస్తితి, అంటా నేను చెప్తే మీరేం చేస్తారు..ఊహించండి.ఉన్న చోట, బాగా బలిసిన రాజకీయ నాయకుని స్విస్స్ బ్యాంకు ఎకౌంటు లా పొంగి పొర్లుతున్నాయి. అశోకుని కాలం నుండి ఎవరూ శుబ్రం చేసినట్టులేదు.మరి ౩ తుపాకులు,౬ బాంబులు అని మన తీవ్రవాద మిత్రులు చెలరేగి పోతున్న కాలం లో ఈ బస్టాండ్ లో భద్రతా ఎలా ఉందయ్యా అంటే,బస్టాండ్ బైట మీకో మెటల్ detector కాన పడుతుంది.కాని దాంట్లోంచి రావటం పోవటం మీ ఇష్టం అనుకోండి.ఎందుకంటె, అంతకుముందు ఉన్న పెద్ద ఎంట్రీ లో ఇదొక చిన్న భాగం మాత్రమె.పక్కనే కూర్చున్న పోలీసాయన కు దీనికన్నా పేపర్ మీదే మక్కువ ఎక్కువున్నట్టుంది. ఆయన లోకం లో ఆయన ఉన్నాడు.హలప్ప మసాల వార్త చదూతున్నాదేమో ఈ లోకం లో మాత్రం లేదు.నాకిక బస్టాండ్ లో ఇంకో పోలీసాయన కనబల్లా.

చెప్పాలంటే చాల ఉంది చెన్న కేశవా అని ఈ బస్టాండ్ ఘనత వర్ణించడానికి ఈ పోస్ట్ సరిపోదని డిసైడ్ అవుతుంటే, నా బస్సు వచ్చింది,ఇక ఉంటా మరి.మీరు కూడా ఎందుకు ఈ చెత్త బ్లాగ్ లో..పని చూస్కోండి.

బేలూర్-అలిబేడు యాత్ర

మే 13, 2010

 

 
పొద్దునే లేవడం యెంత కష్టమైనా, ఎలాగోలా బైలుదేరాం. బస్సు యెక్క గానే మా మిత్రుడు మంచి నిద్ర లోకి జారుకున్నాడు. నాకెందుకో నిద్ర పట్టలేదు.ఈ యాత్ర గురించి ఏంటో కొంత గూగుల్ చేసిన కారణం గా నేమో, అవీ ఇవీ గుర్తొచ్చి కొంచెం excite అయ్యాననే చెప్పొచ్చు. బెంగలూరు దాటాక కనబడ్డ దృశ్యాలు నన్ను నిరాస పరచ లేదు. చుట్టూ అనంత దూరం వరకు పరచుకున్న పచ్చదనం,పొలాలు, చిన్ని చిన్ని గ్రామాలు, కొబ్బరి పోక చెట్ల అంతర సేద్యం అదేదో ప్రణాలికా బద్ధం గా గుంజలు పాటి నట్టు. ఈ పచ్చదనం మద్య పాకి పోతున్న పాము లాగ రోడ్డు, అంటూ పొంతూ లేక సాగుతుంది. రోడ్డు కిరువైపులా బ్రంహాండమైన వృక్షాలు గ్రామ పెద్దలు మనలను ఆహ్వానిస్తున్నట్టున్నాయి.
శ్రావణ బెలగోల సమీపించే కొద్ది, dieting చేసి సన్న బడ్డ అమ్మాయి లా చిక్కింది రోడ్డు. మరీ పక్కింటి దొడ్లోనుండి పోతున్నట్టు సాగింది ప్రయాణం.ఊర్లో ప్రవేసించ గానే కల్యాణి (కోనేరు) స్వగతం పలికింది. పక్కనే కొండ పైకి మెట్ల దారి. ౫౦౦-౬౦౦ మెట్లే కదా అని ఘీన్కరించిన మహానుభావులు సగం దారి లోనే కూలబడ్డారు.వాళ్ళలో నేను ఒకన్నాను కొండి. కొండ లోనే జన్మించాయా అన్నట్టు, సహజ సిద్దం గా ఉన్నాయి మెట్లు. బాహుబలి విగ్రహం స్వచ్చమైన చిరునవ్వు తో మా అలసట మాయమైంది. ప్రాపంచిక విషయాలతో నాకు పనిలేదన్నట్టు, ఊరికి దూరం గా శిఖరాగ్రాన నిలిచి ఉన్న ఏకశిలా విగ్రహం ఆనాటి స్మృతులు నేమరేసుకున్నట్టుంది.
                                                                                                                       ౧౭ మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహానికి రోజు అభిషేకం జరుగదట, ఉత్సవ విగ్రహాని కే ఆ భాగ్యం.భరతుడిని యుద్ధం లో ఓడించిన బాహుబలి, ప్రాపంచిక విషయాలకు విరక్తుడై, ఈ కొండ పై తపస్సు చేసి విముక్తుడైనాడని స్తల పురాణం.గంగా సామ్రాజ కాలం లో (౧౧ శతాబ్దం) ప్రతిష్టించిన ఈ విగ్రహం నేటికి అబ్బురపరుస్తుంది.ఎటు వంటి సదుపాయాల్లేని ఆ కాలం లో ఈ విగ్రహ ప్రతిష్ట ఒక చిత్ర మైతే, ఒకే మెట్ల దారి ఉన్న ఈ కొండ పైకి, మహా మస్తకాభిశేక  సమయం లో సంబారాలన్ని పైకి చేర వేయటం ఇంకో ఎత్తు అని పించింది.
మా తదుపరి మజిలి హళిబేడు. ఇరు వైపులా చెట్లు కప్పేసాయ అన్నట్టుంది కొన్ని చోట్ల దారి.పచ్చని పొలాల మద్యలో కాపలా గా కొబ్బరి చెట్లు, ఎత్తు పెరగటం లో వాటికి పోటి పడుతున్న పోక చెట్లు, అక్కడక్కడా నిండు ఘర్భినిల్లాంటి అనాస చెట్లు. విశాలమైన పచ్చిక బయళ్ళలో మేస్తున్న పశువులు, సాంప్రదాయ కట్టు బొట్టులతో మగువలు చిన్ననాటి గుర్తులను తట్టి లేపాయి.ఇటు గాలి అటు పోనీ concrete అరాన్యాల నుండి ఇదొక ఆట విడుపు, మనవైన మూలాలలోకి ప్రయాణం.
హళిబేడు అంటే ద్వంసమైన పట్టణం. ద్వారా సాగారమనే హోయసలుల రాజధాని, బహమనీ దురాక్రమణ వల్ల, దంసమైనది కాబట్టి ఆ పేరు వచ్చింది. హొయసలేశ్వర ఆలయం ఒక అద్బుతం.దాదాపు ౧౦౦ ఏళ్ళు కట్టబడ్డ ఈ ఆలయం అసంపూర్తి గానే మిగిలిపోయింది.ఇది సిమెంట్ అనేది ఉపయోగించకుండా అమరిక పద్దతి లో నిర్మించ బడిన విచిత్రం. రెండు ఆలయాల ప్రాకారం అబ్బురపరుస్తింది. ఆలయాల బైట విగ్రహాలు, శిల్ప సౌందర్యం కదల నివ్వవు.హోయసలేస్వరునికి పూజాదికాలు నేటికి జరుగుతున్నాయి.రెండు నందీస్వరులు  జీవ కళలతో అలరారు తున్నాయి.ఆలయం బైట దేవతామూర్తులు,రామాయణ ఘట్టాలు ఒక రోజు ఐన వెచ్చించి చూడదగ్గవి. ఏనుగు పొట్టలో శివ తాండవం, కృష్ణుడు గోవర్ధనం ఎత్తడం, లాంటి ఘట్టాలు చెప్పదగ్గవి.అసంపూర్తి గా మిగిలిన ఘట్టాలే ఇలా వుంటే పూర్తి ఐతే ఎలా ఉండేవో అన్న ఊహ రాక మానదు.ఈ ఆలయం చుట్టూ పక్కల హోయసలుల శిల్ప సౌందర్యం తో అలరారే ఆలయాలు ౧౦-౧౫ ఉన్నాయట.
బేలూర్ మా చివరి మజిలి. హోయసలుల మొదటి రాజధాని.౧౧ వ శతాబ్దం లో విష్ణు వర్ధనుని చే నిర్మించబడ్డ, చేన్నకేసవ ఆలయం లో నేటికీ పూజాదికాలు జరగటం విశేషం.విజయనగర కాలం లో ఈ ఆలయం జీర్ణోద్దరణ కాబడింది.చేన్నకేసవ విగ్రహం ౨ మీటర్ల ఎత్తు ఉంటుంది.నిజంగానే సుందరుడు ఈ చెన్న కేస్వవుడు.ఆలయం లోని జయ విజయుల విగ్ర హాలు, స్తంభాల పై, ఆలయం పైభాగం లో శిల్ప కల బేలూర్ ఎందుకంత ప్రసిద్ధి పొందిదో తెలియజేస్తాయి.ఆలయం లో ౪౦ స్తంభాలు దేని కదే ప్రత్యేకం.ప్రతి స్తంభం పై చిత్రకళా చూడదగ్గది.
మొత్తానికి ఈ యాత్ర, విజయనగరానికి పూర్వం విరాజిల్లిన హిందూ సామ్రాజ్యం గురించి మంచి పరిచయం.వివిధ కారణాల వల్ల మనకు వారి గురించి మనకు పెద్ద గా తెలియక పోయినా,హోయసలుల కళాదృష్టి,హిందూ ధర్మోద్దారణ కై వారు నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయాలు ఈ నాటికీ వారి గొప్ప తనాన్ని చాటుతున్నాయి.

కరునామయులు…

మే 8, 2010
మొన్నామధ్య మన కసాబ్ తీర్పు మీద అదేదో ఛానల్ లో చర్చా కార్యక్రమం. ఒకామె తెగగింజుకోవడం చూసాను.ఉరిశిక్ష వేస్తె, ఆయనకీ తను చేసిన తప్పు తెలియదట…శిక్ష పరివర్తన తేవాలి అని భాధ పడి పోయింది. ఇలాంటి వాళ్ళకు మన దేశం లో తక్కువేమీ లేదు. ఈవిడ ఇంట్లో వాళ్ళో బంధువులో ఆ దాడి లో పోయుంటే ఆమె ఇలా మాట్లాడేద?? సి.ఎస్.టీ లో జరిగిన మారణ హోమం, ప్లాట్ ఫోరం పైన అటు ఇటు చెల్లాచెదరైన మృతదేహాలు, ఎటు చుసిన రక్తం, తామెందుకు చనిపోతున్నమో తెలీక, ఏమి జరుగుతుందో తెలీక ప్రాణాలు విడిచిన ప్రజలు…పిల్లలు, మహిళలు, వ్రుద్దులని తేడాలేక జరిగిన దారుణం…మత పిచ్చి తో మదమెక్కిన మూకల నర మేధం…మీరు దేశభక్తి తో ఆలోచించక పోయినా మానవత్వకోణం లో నైన హృదయ విదారకం.
నారిమన్ హౌస్ లో అమాయకుల ఊచకోత, తాజ్ ముట్టడి ఇవన్ని ఎలా మర్చి పోతారు. సలస్కర్, ఆమ్టే, ఉన్నికృష్ణన్  లాంటి వీరుల బలిదానం, మనమెలా మర్చి పోగలం. మరి వీటన్ని టికి కారణం అయిన వాళ్ళను వదిలెయ్యాలా…
నారిమన్ హౌస్, తాజ్, మరి ఇతర చోట్ల జరిగిన సంఘటనలు ఈ దేశం ఉగ్రవాదులకు యెంత సాఫ్ట్ కార్నెర్ గా మారిందో చెప్పకనే చెప్తున్నాయి. మరి దొరికిన వాడిని కూడా క్షమాభిక్ష లేక పరివ్వర్తన అని వదిలేస్తే, రేపు ఈ ఇలాంటి సంఘటనలు రొజూ జరగోచ్చు. ఇంత జరిగిన మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ కసాబ్ గారికి ఎన్నో బంపర్ ఆఫేర్లు ఇస్తోంది…ఆయన మల్ల supreme కోర్ట్ కి వెళ్ళచ్చు. అక్కడా అదే తీర్పు వస్తే రాష్ట్రపతి క్షమా భిక్ష అడగడానికి ఇలాంటి తిక్క జనానికి మన దేశం లో కొదువ లేదు.
౧౬౧ మంది మరణానికి కారణమైన ఒక కిరాతక ఉగ్రవాదిని ఉరి తియ్యాలి అని డిసైడ్ కావటానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఐన అది జరుగుతుందో లేదో తెలీదు.ఇలాంటి మానవతా వాదులు కరునామయులు ఉన్న దేశం లో యెంత మంది కసాబ్ లు లాడెన్ లు వచ్చిన మనం వాళ్ళను పరివర్తన చేసి పంపాలి కాని… అనే నసిగే జనాలను ముందు ఉరి తీయ్యాలి. ఇలాంటి  విషయం లో నైన మనం ఐక్యత చూపక పొతే రేపు ఈ సంఘటన మీ వీదిలో మీ ఇంట్లో జరగోచ్చు…అప్పుడు ఆలోచించ డానికి, ఆరోపించడానికి ఏమి మిగలదు…