Archive for ఏప్రిల్, 2010

అమ్మో బొమ్మ…

ఏప్రిల్ 15, 2010

ఒక ౨-౩ ఏళ్ళు అయి ఉంటుందేమో ఒంగోలు లో ౧-౨ వారాలు ఏకబిగిన ఉండి. ఈ సారి మా మేనేజర్ గారి పుణ్యమా అని ఆ అవకాశం దక్కింది. కొంచెం నింపాదిగా ఊరంతా తిరిగి ( పెద్ద ఊరేం కాదులెండి) విషయాలు తెలుసుకోవడానికి, డిగ్రీ కాలం నాటి దోస్తులను కలుసుకోవడానికి. ఆ నాటి స్మృతులు నెమరు వేసుకోవడానికి.కొంచెం పరిశీలించి చూస్తే మా వూరికి కొత్త ట్యాగ్ తగిలించవచ్చు అనిపించింది. విగ్రహాల పట్టణం అని. మన నాయకుల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ, రోడ్ మద్యలో, చౌరస్తా దగ్గర, మీ వీధి మొదట్లో, ఎక్కడ కొంచెం జాగా ఉంటె అక్కడ. ఇందు గల దండులేడని ప్రహ్లాదుని లా మీరు వెతుక్కో అక్కర్లేదు. కేంద్ర నాయకుల నుంచి వీధి వార్డ్ మెంబెర్ నాయకుల దాక అందర్నీ సంతృప్తి పరచేసారు. కొంచెం అజాగ్రత్త గ మాములు రోడ్ మీద పోయినట్టు పొయ్యారో ఏ ఇందిరా గాంధీ నో రాజీవ్ నో మీరు ముద్దెట్టుకోవడం తద్యం. ఈ రోగం యెంత వరకు పాకిందంటే కొన్ని రోడ్లు చూస్తె అవి జనం కోసం కాదు విగ్రహాల కోసమే అన్నట్టుంటాయి. అన్ని రోగాలకు ఒకటే కారణం అన్నట్టు ఈ దురావస్త కు మన జాతీయ అంతర్జాతీయ పార్టీ ( నాయకురాలు ఇంపోర్టెడ్ ఫ్రొం ఇటలీ ఏ కదా) కి ప్రాంతీయ తెలుగు రోషం పార్టీ కి మద్య నడుస్తున్న బొమ్మల పొటీనే. వాళ్ళు ఒక బొమ్మ పెడితే వీళ్ళు రెండు పెట్టాలి. అదీ నడి రోడ్డు మీదే. ఐన జనం వాళ్ళ సొంత స్తలం లో ఇల్లు కట్టు కోవటానికి ఎన్నో రూల్స్ వాళ్ళ శ్రాద్ధం అని దేబరించే మునిసిపాలిటి వాళ్ళు,( ఆ చేతిలో పడాల్సింది పడే దాకా నే లెండి ) వీటన్నిటికి అనుమతులు ఎలా ఇస్తున్నారో అనేది మా ఇంటి ముందు ఉన్న శిలాఫలకం లేని గుర్తు తెలియని బొమ్మ మీద ఒట్టు, నాకైతే అర్ధం కాలా. ఎక్కడి దాక నో ఎందుకు మా ఇల్లు కట్టే టప్పుడు అన్ని అనుమతులు ఉండి, సమర్పయామి అంతా అయ్యాక ఒక మునిసిపాలిటి ఉద్యోగి కెవరికో మామూలు అందలేదని ఆయన మా ఇంటికి వచ్చి ౯౦% పూర్తయిన ఇల్లు నిభందనలు పాటించ లేదని, కూలగొట్టాలి అని భరతనాట్యం చెయ్యడం నాకు ఇంకా గుర్తుంది. మరి వీళ్ళ బొమ్మలు ఆ category లోకి రావా. ఇంకా హాస్యా స్పదమైన విషయం ఏమి టంటే, కొన్ని విగ్రహాలు మీరు గుర్తు పట్టలేరు. ఆయన ఎవరో అక్కడెందుకు పెట్టారో శిలాఫలకం ఉంటె చదివి ఓహో ఆయనా అనుకోవచ్చు…ఆ ఫలకం ఎవ్వరైనా ఇంట్లో వేస్కో వటానికి స్వాహా చేసారా…ఆ బొమ్మ ఎవరిదో ఎవరికీ తెలీదు. మరి మీ పేరు కింద రాసుకున్నా ఎవరికి ఎటు వంటి అనుమానం రాదు. ;౦ మరి ఇలాంటి బొమ్మలు పెట్టే కన్నా, ఆ బొమ్మలకు వాడిన సిమెంటు కొంచెం రోడ్లు మరమ్మత్తు చేయడానికి వాడితే పుణ్యం పురుషార్ధం. మా వూర్లో ఆలాంటి శ్రద్ధ అవసర మైన రోడ్లు లెక్కకు మిక్కిలి. లగే రహో మున్నాభాయ్ లో గాంధీ charector చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. అదేదో సందర్భం లో ఎవరో తన విగ్రహం పగుల కొట్టారని తెలుసుకొని,దేశం లో తన విగ్రాహాలన్ని పగులకోట్టినా పర్లేదు అంటుంది. అలాంటి జన హృదయ నేతలకు ఇలా జనాలను ఇబ్బంది పెట్టి ఇదెక్కడి ముదనస్తపు…….అనిపించుకునే అవసరం లేదు.మరి ఈ సద్బుద్ధి మన నాయకులకు ఎప్పుడొస్తుందో…అసలు బుద్ది అనేది ఉంటే కదా అంటారా ……